Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్, తన కుమార్తె సీమాతో కలిసి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా పోస్టులో కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించాలనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘నేను హిసార్ ప్రజలకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాను మరియు మంత్రిగా హర్యానా రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశాను. హిసార్ ప్రజలే నా కుటుంబం. నా కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.
Read Also: BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్‌కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..
సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియాలో లిస్ట్‌లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. దివంగత పారిశ్రామికవేత్త మరియు మాజీ మంత్రి OP జిందాల్ భార్య సావిత్రి జిందాల్ నికర విలువ 29.1 బిలియన్ డాలర్లుగా ఉంది. గతంలో హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014లో హిస్సార్ నుంచి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. గుప్తా ప్రస్తుతం సైనీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత.. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము కలిసి పనిచేస్తామని, మమ్మల్ని మోడీ పరివార్‌లో సభ్యులుగా చేసినందుకు బిజెపికి చెందిన ప్రతి ఆఫీస్ బేరర్ మరియు కార్యకర్తకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మేము పార్టీ అంచనాలకు అనుగుణంగా నడుస్తామని ఆమె అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాన మంత్రి దార్శనికత తనని ఆకట్టుకుందని ఆమె చెప్పారు. హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది.