Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
ఇదిలా ఉంటే, 6 దశాబ్ధాల క్రితం చైనా నుంచి దలైలామా ఎలా పారిపోయి వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 23 ఏళ్ల సన్యాసి తన రాజభవనం నుంచి నిశ్శబ్ధంగా సరిహద్దులు దాటి, తన అనుచర గణంతో భారత్ చేరారు. అప్పటి నుంచి భారత్‌లోనే 14వ దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. ఇలా ఆశ్రయం కల్పించడం కూడా భారత్-చైనాల మధ్య వివాదానికి కారణమైంది.
Read Also: Falcon Group Scam: ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్.. రూ.792 కోట్లకు టోకరా..
చైనా జనరల్ ఆహ్వానంతో అనుమానం:
దలైలామా తప్పించుకోవడానికి కీలక కారణం, ఓ చైనీస్ జనరల్ ఆయనను ఆహ్వానించడమే. నిజానికి 1950లో టిబెట్‌ని చైనా ఆక్రమించిన తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), టిబెటన్ ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1951లో టిబెట్-చైనా మధ్య 17 పాయింట్ ఒప్పందం జరిగింది. చైనా సార్వభౌమాధికారం కింద టిబెట్‌కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, చైనా దీనిని ఉల్లంఘిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో ఓ చైనా జనరల్ దలైలామాను సైనిక ప్రధాన కార్యాలయానికి ఒక డ్యాన్స్ ప్రదర్శనకు ఆహ్వానించారు. అయితే, బాడీగార్డ్స్ లేకుండా రావాలనే షరతు విధించారు. దీంతో, టిబెట్ నాయకత్వంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చైనా దలైలామాను చంపడానికి లేదా కిడ్నాప్ చేయడానికి కుట్ర చేస్తుందని భావించారు. మార్చి 10, 1959న, లక్షలాది మంది టిబెటన్లు దలైలామాను రక్షించడానికి నార్బులింకా ప్యాలెస్ చుట్టూ మానవ బారికేడ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో చైనా సైనికులు, టిబెటన్ రెబల్స్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. దీంతో దలైలామా పారిపోవాల్సి వచ్చింది. మార్చి 17, 1959లో ఆర్మీ యూనిఫాం ధరించి, దలైలామా నార్బులింగకా నుండి తప్పించుకున్నారు. హిమాలయాల గుండా ప్రయాణిస్తూ, చైనా గస్తీని తప్పించుకుంటూ 13 రోజుల తర్వాత, మార్చి 31, 1959న, దలైలామా మరియు అతని పరివారం ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖెంజిమనే పాస్ వద్ద మెక్‌మహాన్ లైన్‌ను దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల వల్లే దలైలామా చైనాకు చిక్కకుండా తప్పించుకున్నారని ఇప్పటికీ ఆయన అనుచరులు చెప్పుకుంటారు.
భారత సరిహద్దుల్లోకి రాగానే వారిని అస్సాం రైఫిల్స్ కు చెందిన భారత సైనికులు కలిశారు. మరుసటి రోజు భారత అధికారులు చుటాంగ్ము అవుట్ పోస్ట్ వద్ద అధికారికంగా ఆయనను స్వాగతించారు. ఆ తర్వాత తవాంగ్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 3న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దలైలామాకు మానవత దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దలైలామా మొదట ముస్సోరీలో స్థిరపడ్డారు, తరువాత 1960లో ధర్మశాలలోని మెక్లియోడ్‌గంజ్‌కు వెళ్లారు, దీనిని ఇప్పుడు “లిటిల్ లాసా” అని పిలుస్తారు. అక్కడ, ఆయన ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. పాఠశాలలు, మఠాలు స్థాపించారు. 1989లో అహింసకు నిబద్ధతగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 90 ఏళ్ల వయసులో ఆయన ధర్మశాలలో నివసిస్తున్నారు.