ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 20 వేలను దాటుతోంది. వరుసగా మూడో రోజు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. దీంతో పాటు మరనణాల సంఖ్య, రికవరీల సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. అయితే కొన్ని సార్లు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇది సెకండ్ వేవ్ లో పోల్చితే తక్కువే. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ సమర్థవంతంగా అందించడంతో మరణాల సంఖ్య దిగిరావడతో పాటు రికవరీల సంఖ్య కూడా పెరిగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 56 మంది కరోనా బారినపడి మరణించారు. గత 24 గంటల్లో 18,301 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,40,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో ఇప్పటి వరకు 4,37,30,071 కేసులు నమోదు కాగా..4,30,63,651 మంది కోలుకోగా.. 5,25,660 మంది మరణించారు.
Read Also: Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది
దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లకు చేరుకుంది. గతేడాది జనవరిలో ప్రారంభం అయిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా.. దేశంలో అర్హులైన వారికి 199,71,61,438 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. నిన్న ఒక్క రోజే ఇండియాలో 22,93,627 వ్యాక్సిన్ వేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులు పరిశీలిస్తే అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,62,16,104 కు చేరింది. మొత్తం 63,85,632 మరణించారు.