Congress:వెనుజులా సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మౌనంగా ఉందని కాంగ్రెస్ తన దాడిని తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికైన అధ్యక్షుడిని బలవంతంగా తొలగించారని, అయినా భారత్ మౌనంగా ఉందని ఆరోపించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ వెనిజులాలో జరుగుతున్న పరిణామాలు “ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధం” అని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రపంచానికి చెడు సంకేతాన్ని అందిస్తాయని హెచ్చరించారు.
Read Also: Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!
‘‘వెనిజులాలో జరిగింది UN చార్టర్‌కు విరుద్ధం. ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. రేపు మరే ఇతర దేశానికైనా ఇది జరగవచ్చు అనేది చాలా తీవ్రమైన ఆందోళన. రేపు ఇది భారతదేశానికి కూడా జరగవచ్చు’’ అని చవాన్ అన్నారు. వెనిజులాలో నికోలస్ మదురోకు జరిగినట్లుగా భారతదేశంలో జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా?” అని ప్రశ్నించారు. ప్రపంచంలోని ప్రధాన సంఘర్షణలపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో విఫలమైందని చవాన్ ఆరోపించారు. రష్యా, చైనాలు ఏదో ఒక వైఖరిని తీసుకున్నాయని, అమెరికాను విమర్శించాయని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ ఇలాగే చేసిందని, ఏ పక్షాలనికి మద్దతు ఇవ్వలేదని, ఇజ్రాయిల్-హమాస్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోలేదని అన్నారు. మనం అమెరికన్లకు ఎంతగా భయపడుతున్నామంటే, దానిని విమర్శించడానికి కూడా భయపడుతున్నామని చవాన్ అన్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై చవాన్ స్పందిస్తూ.. ఇవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. వెనిజులా ఆయిల్ నిల్వలే అసలైన కారణం అని అన్నారు. వెనిజులా ఆయిల్‌పై అమెరికా కన్నేసిందని ఆరోపించారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాలు అమెరికాను విమర్శించాయని, భారత్ మాత్రం మౌనంగా ఉందని అన్నారు. మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న స్థితిలో, భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కావాలని అనుకుంటే ఇలాంటి విషయాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని అన్నారు.