Nagpur Violence: ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. సోమవారం, ప్రార్థనలు ముగిసిన తర్వాత కొందరు ముస్లిం మూక రోడ్లపైకి వచ్చి వాహనాలకు, దుకాణాలకు ముప్పుపెట్టారు. మరో వర్గం దుకాణాలు, వ్యాపారాలను లక్ష్యం చేసుకుని దాడి చేసినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఫహీమ్ ఖాన్‌తో పాటు మరో ఐదుగురిపై దేశద్రోహ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
Read Also: BJP MP: “ఒకే వైపు వెళ్తున్నాం”.. శశిథరూర్‌తో బీజేపీ నేత ఫోటో వైరల్..
నాగ్‌పూర్ హింసాకాండలో దెబ్బతిన్న ఆస్తుల విలువను అల్లర్లు చేసిన వారి నుంచి వసూలు చేస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని విక్రయించాల్సి వస్తుందని ఆయన శనివారం చెప్పారు. ఎక్కడ అవసరమైతే అక్కడ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సీసీటీవీ కెమెరాల నుంచి ఆడియో, వీడియో ఫుటేజ్‌లను విశ్లేషించామని, 104 మంది అల్లర్లకు పాల్పడినట్లు వారిని గుర్తించామని, 12 మంది మైనర్లతో సమా 92 మందిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పారు.
నాగ్‌పూర్ హింసా కాండ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. పోలీస్ సిబ్బందిపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని ప్రభుత్వం విడిచిపెట్టేదే లేదు అని ఫడ్నవీస్ చెప్పారు. ఈ అల్లర్లలో విదేశీ లేదా బంగ్లాదేశ్ హస్తం ఉందని వ్యాఖ్యానించడం తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. ఈ సంఘటనను ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పలేమని, మహిళా కానిస్టేబుళ్లపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయని, వారు వేధింపులకు గురికాలేదని చెప్పారు. ఈ హింసకు రాజకీయ కోణం లేదని అన్నారు.