దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జనవరిలో థర్డ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తొలిగిపోవడంతో కేసుల సంఖ్య, వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గింది. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య వేలల్లోనే నమోదు అవుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3 వేలకు దిగువనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,124 కేసులు నమోదు అయ్యాయి. సోమవారంతో(1675) పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. 17 మంది ప్రాణాలు కోల్పోగా… 1977 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,971గా ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.46గా ఉంది.
దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,31,11,372 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 5,24,507 మంది చనిపోయారు. కోలుకున్న వారి సంఖ్య 4,26,02,714గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు అర్హులై వారికి 1,92,67,44,769 వ్యాక్సినేషన్ అందించారు. గడిచిన 24 గంటల్లో 13,27,544 మందికి టీకాలు ఇచ్చారు.
భారత్ పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క రోజే 6,21,079 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 1,464 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 52,87,80,120 కు చేరింది. మరణాలు సంఖ్య 63,03,425గా ఉంది.