దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇవాళ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ ప్రతిరోజు స్వల్ప హెచ్చుతగ్గులతో 15 వేలకుపైనే కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు 17 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. తాజాగా 16 వేల దిగువకు అవి చేరాయి. గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,940 మంది వైరస్ బారినపడ్డారు. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 12,425 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి.
తాజా మరణాలతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి మొత్తం సంఖ్య 5,24,974కి చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,61,481 లకు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 91,779గా ఉంది. రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. రోజు రోజుకు నమోదవుతున్న కేసుల మధ్య అంతరం భారీగా ఉంటోంది. శుక్రవారం నాడు 88,284 యాక్టీవ్ కేసులు ఉంటే.. నేడు అది 91,779కి పెరిగింది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.21 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రోజువారీ పాజిటివ్ రేటు 4.39 శాతంగా ఉంది. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
దేశంలో శుక్రవారం 15,73,341 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,94,40,932 కోట్లకు చేరింది. మరో 3,63,103 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.