పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్‌సింగ్ ను ఎంతో ఆరాధిస్తాడు. ఎంతలా అంటే తన ప్రమాణస్వీకారానికి భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామాన్ని ఎంచుకున్నారు. బసంతి తలపాగా ధరించి అచ్చు భగత్‌సింగ్‌లా దర్శనమిచ్చారు. ఐతే, సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫొటోపై ఇప్పుడు వివాదం రేగింది. ఆ ఫొటోలో ఆయన బసంతి తలపాగా (పసుపు రంగు తలపాగ) ధరించి ఉంటమే వివాదానికి కారణం. ఆ ఫొటో ప్రామాణికతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
చరిత్రకారుల ప్రకారం ఇది భగత్‌సింగ్ ప్రామాణిక ఫొటో కాదు. అది కేవలం ఒక ఊహాచిత్రం మాత్రమే. భగత్ సింగ్ ఎప్పుడూ బసంతి లేదా కేసరి తలపాగా ధరించలేదు. అది కేవలం కల్పితం. నిజానికి భగత్‌సింగ్‌కు సంబంధించినంత వరకు కేవలం నాలుగు ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కల్పితాలు అని అంటున్నారు భగత్‌సింగ్‌పై అనేక రచనలు చేసిన ప్రొఫెసర్ చమన్ లాల్. ఆయన ఢిల్లీలోని భగత్ సింగ్ రిసోర్స్ సెంటర్ గౌరవ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.
భగత్‌సింగ్ నాలుగు నిజ చిత్రాలలో ఒకటి ఆయన జైలులో జుట్టు విరబోసుకున్నది. మరొకటి టోపీ ధరించినది. మిగతా రెండింటిలో తెలుపు తలపాగా ధరించారు. ఇవిగాక మనం చూసే పసుపు, నారింజ రంగు తలపాగాలు, ఆయన చేతిలో ఆయుధంతో ఉన్న ఫొటోలన్నీ ఊహాజనితమైనవే.
భగత్‌సింగ్ ఆశయాల గురించి నేటి యువతకు తెలిసేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలి. కానీ, రాజకీయ ప్రయోజనాలకు ఆయనను వాడుకోకూడదు. కనుక పంజాబ్ ప్రభుత్వం భగత్‌సింగ్ నిజ చిత్రాలను మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చాలి. సినిమాలలో, పెయింటింగులలోచూసిన భగత్‌సింగ్ ను సర్కార్ ఆపీసుల్లో పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న బసంతి, నారింజ , ఎరుపు రంగు తలపాగాలో కనిపించే భగత్‌సింగ్ నిజ చిత్రం లేనే లేదని చరిత్ర పరిశోధకులు అంటున్నారు.
అయితే, భగత్ సింగ్ బసంతీ తలపాగా ధరించి ఉండకపోతే ఎందుకు దానికి ఇంత ప్రాచుర్యం వచ్చిందన్నది ప్రశ్న. అందుకు మొదటి కారనం పంజాబ్ జరిగే నిరసనలు, విప్లవ పోరాటాలు పసుపు రంగుతో ముడిపడి ఉండటం. ఇటీవలి రైతు ఆందోళనలో అన్నదాతలు పసుపు రంగు జెండాతో కనిపించారు. పసుపు రంగు తలపాగాలు, శాలువలు కప్పుకుని కనిపించారు. ‘మేరా రంగ్ దే బసంతి చోళ మాయే రంగ్ దే..’ వంటి దేశభక్తి గీతాలు కూడా ఈ ఆలోచనల వెనక ఉండవచ్చు.
నిజానికి, భగత్ సింగ్ మాత్రమే కాదు ఏ పంజాబీ విప్లవకారుడూ బసంతీ తలపాగా ధరించారనటానికి ఆధారాలు లేవు. 1927లో గోరఖ్‌పూర్ జైలులో ఉరికంబం ఎక్కిన విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్, 1931లో లాహోర్ జైలులో ఉరిశిక్ష అనుభవించిన భగత్ సింగ్ ఇద్దరూ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో భాగస్వాములే కానీ ఎప్పుడూ జైలులో కలిసి ఉండలేదు. ‘మేరా రంగ్ దే బసంతి చోలా… పాటను బిస్మిల్ రాశారు. కానీ, ఈ పాటను జైలులో భగత్ సింగ్ పాడినట్లు సినిమాల్లో చూపించారు. అందుకు ఎటువంటి ఆధారాలు లేవు.
బసంతి అంటే ప్రకాశవంతమైన పసుపు రంగు. ఇది ఉల్లాసానికి చిహ్నం. పంజాబ్‌లో బసంతి ఉత్సవంతో వసంత రుతువు ప్రారంభమవుతుంది. కాబట్టి పంజాబీలలో, ముఖ్యంగా గ్రామాలలో బసంతి చాలా ప్రాచుర్యం పొందింది. పంజాబ్‌లోనే కాదు వసంత పంచమి భారతదేశం అంతటా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగ. ఇవన్నీ నిజమే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెయింటింగ్ ఆధారిత చిత్రాన్ని పెట్టడమే అభ్యంతరకం. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వారు చరిత్రను మలచటం సరికాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ భగత్‌సింగ్‌కు సంబంధించిన నాలుగు నిజ చిత్రాలలో ఏదో ఒకదానిని పెడితే బాగుంటుంది.
మరోవైపు, ఇది చర్చించాల్సిన అంశమే కాదంటున్నారు భగత్ సింగ్ కుటుంబీకులు. ఈ చర్చ కన్నా ఆయన ఆశయాలు నెరవేర్చటం, ఆదర్శాలు పాటించటం ముఖ్యం అంటున్నారు భగత్ సింగ్ మేనల్లుడు జగ్మోహన్ సింగ్. 77 ఏళ్ల జగ్మోహన్ భగత్‌సింగ్ సోదరి బీబీ అమర్ కౌర్ కుమారుడు. భగత్ సింగ్ వాస్తవ చిత్రాలు నాలుగు మాత్రమే ఉన్నాయని ఈయన కూడా ఒప్పుకుంటారు. వాటిలో బసంతి తలపాగా ధరించిన ఫొటో లేదంటారాయన. ఈ చర్చను ఆపి ఆయన ఆశయ సాధనపై దృష్టి పెట్టాలన్నారు.
భారత దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని భగత్‌సింగ్ బలంగా విశ్వసించాడు. కులతత్వ సంకెళ్ల నుంచి యువతను విముక్తి చేసేలా వారు శాస్త్రీయ దృక్పథం అలవరచుకునేందుకు -చదవండి,ఆలోచించండి,విమర్శించండి అనే నినాదంతో- నౌజవాన్ భారత్ సభను స్థాపించాడాయన. ఆ ఆశయాన్ని నిజం చేయటం ఇప్పుడు ఆప్ ప్రభుత్వ కర్తవ్యం. భగత్‌సింగ్ దార్శనికతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుకు తీసుకెళ్లి మన రాజ్యాంగంలో సామాజిక న్యాయ విలువలను పొందుపరిచారు. తలపాగా రంగుల కంటే ఈ ఇద్దరు మహానుభావుల దర్శనికత ప్రజలకు తెలియటం ముఖ్యం. అందుకు పంజాబ్ ప్రభుత్వం భగత్ సింగ్ ఆలోచనలను బుక్లెట్ ముద్రించి ప్రభుత్వకార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. తద్వారా ప్రజలు, అధికారులు చదవడమే కాదు వాటి గురించి ఆలోచిస్తారు. భగత్ సింగ్, అంబేద్కర్ దార్శనికతలను నిజమైన స్ఫూర్తితో అనుసరించకపోతే ఎన్ని ఫొటోలు పెడితే ఏమిటి ప్రయోజనం. ఐతే, భారతదేశాన్ని నిజమైన అర్థంలో స్వతంత్రంగా చూడాలనుకునే ఇద్దరు నిజమైన దార్శనికులను ఆదర్శంగా ఎంచుకున్న ఆప్ ప్రభుత్వాన్ని అభినందించాలి.
పంజాబ్ లోనే కాదు యావత్ భారతదేశానికి ఇప్పటికీ భగత్ సింగ్ హీరో. ‘రో రో ఆఖే ధరత్ దోబే ది, మాఝే మాల్వే ది, అజ్జ్ లోడ్ దేశ్ ను భగత్ సింగ్ తే వీర్ సరభే ది…’ (దోబా, మాఝా, మాల్వా ప్రాంతాలు కన్నీరు పెడుతున్నాయి, భగత్ సింగ్, కర్తార్ సింగ్ సరభ మళ్లీ ఈ దేశానికి అవసరం …) అనే పాటలు ఢిల్లీ, పంజాబ్ రైతు ఆందోళల్లో మార్మోగాయి. నిజానికి, ఏ దేశానికైనా, ప్రాంతానికైనా సదా గుర్తుండే కొందరు మహాపురుషులు ఉంటారు. భగత్ సింగ్ అలాంటి ఆరాధ్యులలో ఒకరు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. నవ్వుతూ ఉరికంబం ఎక్కి నిర్భీతికి చిహ్నం అయ్యాడు. మంచికోసం చివరి వరకు నిలబడే మనిషిగా ప్రజల మనసులలో నిలిచిపోయారు.
భగత్‌సింగ్ దృష్టిలో భారతదేశం అంటే కార్మికులు, కర్షకులు, శ్రామికులు. శ్రామికవర్గం దోపిడీకి గురికాకుండా అందరికీ సమాన అవకాశాలు, హక్కులున్న భారతదేశం గురించి కలలుగన్నాడు. అందుకే ఆయన మరణించి 90 ఏళ్లయినా రైతులు, విద్యార్థులు, కార్మికులు సాగించే నిరసన పోరాటాలలో ఆయన ఉంటారు. ఉత్తరాధిలోనే కాదు దక్షిణాధి భారత రాష్ట్రాలే కాదు దాయాది పాకిస్తాన్ కూడా భగత్సింగ్లోని హీరోని ఆరాధిస్తుంది. ఆయన తమ వాడని చెప్పేటప్పుడు ప్రతి పంజాబీ ఛాతీ గర్వంతో పొంగిపోతుంది.
రైతు ఆందోళన సమయంలో భగత్ సింగ్ రచనల పంజాబీ అనువాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిలో .. కళ్ళు మూసుకుని చదవకండి, పుస్తకంలో రాసిందే నిజం అనుకోకండి. చదవండి, ఆలోచించండి, విమర్శించండి.. అనే మాటలు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటాయి.
పంజాబ్‌లో కొత్తగా కొలువుదీరిన ఆప్ సర్కార్ భగత్‌సింగ్, బాబాసాహెబ్ ఆశయాల మేరకు పనిచేస్తుందా…లేదంటే ఇతర పార్టీలలా అధికారం కోసం చేసే ఆరాటమా అనేది త్వరలో తేలిపోతుంది.