Congress Working Committee To Meet On Sunday: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఈ నెల 28న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం అవుతోంది. ఆగస్టు 28, మధ్యాహ్నం 3.30 గంటలకు సోనియా అధ్యక్షతన వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే రాహుల్ మాత్రం అందుకు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత అప్పటి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియాగాంధీ మళ్లీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గం జీ-23 నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఈ పరిణామాల తర్వాత రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయం ఉంటుందని భావించినప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల దిశగా ఏ నిర్ణయం తీసుకోలేదు.
Read Also: Addanki Dayakar: ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే..!
ఇదిలా ఉంటే వచ్చే నెల సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయబోతోంది. సెప్టెంబర్ 4న ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన తెలపబోతోంది. దీంతో పాటు సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ దేశమంతా ‘‘ భారత్ జోడో’ యాత్రను మొదలుపెట్టనున్నారు. మరోవైపు కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలోనే సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా విదేశాలకు వెళ్లనున్నారు.