BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135 స్థానాల్లో గెలుపొందింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 137కు చేరింది.
Read Also: DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలతో సగటు బీజేపీ కార్యకర్త, నాయకుడు నిరాశ చెందాడనేది వాస్తవం. అయితే మరో విషయాన్ని తలుచుకుని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే కర్ణాటకలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుంది. గతంలో కొన్ని పర్యాయాలు ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కాబట్టి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో మంచి మెజారిటీలో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా.. కాంగ్రెస్, జేడీయూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అయితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం కొనసాగింది. తిరిగి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి.. 2024లో వచ్చేది బీజేపే అని సగటు బీజేపీ అభిమాని సంతోషపడుతున్నాడు. ఈ విషయాలన్నే బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ప్రస్తావించారు.