ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉండబోదని హస్తం పార్టీ శుక్రవారం తేల్చి చెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ తాజా ప్రకటనతో దేశ రాజధాని హస్తినాలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Nigeria: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తా పడి 100 మంది మృతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఏడాది ప్రారంభంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ 11 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక బీజేపీ కూడా ఎన్నికల కోసం 43 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీలు మరియు కేంద్ర పథకాల లబ్ధిదారులతో సంప్రదింపుల కోసం ఉద్దేశించిన ప్రచారాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆదేశాల మేరకు కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. నామినేషన్, మీడియా సంబంధాలు, ప్రచార కథనాలను సూచించడం, సోషల్ మీడియా, డాక్యుమెంటేషన్, డేటా మేనేజ్‌మెంట్, ప్రత్యేక పరిచయాలు మరియు లాజిస్టిక్‌లు వంటి వివిధ ఎన్నికల సంబంధిత పనుల కోసం కమిటీలు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 2025న లేదా అంతకు ముందు జరగాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి. ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మూడవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం 2025 ఫిబ్రవరి 15తో ముగియనుంది.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!