Congress Steering Panel Holds First Meeting: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం ప్రారంభం అయింది. ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్,నియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
అక్టోబర్ నెలలో ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయింది. పార్టీ ప్లీనరీ సమావేశాల తేదీలు, ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం అన్నారు. పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధిత తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ ప్లీనరీ సమావేశానికి 9 వేల మంది పీసీసీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా 24 ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన మొదటిసారిగా పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ బలోపేతానికి, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా నేడు రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలి ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. కాశ్మీర్ లో యాత్ర ముగుస్తుంది.