Congress Review Petition In Supreme Court On Release Of Rajiv Gandhi Assassination Convicts: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులు ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే! దోషుల మంచి ప్రవర్తన, వారి విడుదలపై గాంధీ కుటుంబం నుంచి వ్యతిరేకత రాకపోవడంతో పాటు ఇతర అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని.. వారిని విడుదల చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్, రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
దోషుల విడుదలపై గాంధీ కుటుంబంపై ఎలాంటి స్పందన రాలేదు కానీ, కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ప్రధాని హత్యకు పాల్పడ్డ దోషులకు విముక్తి కల్పించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు సుప్రీం తీర్పును సవాల్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ.. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. అటు.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీం తీర్పుని వ్యతిరేకించాయి. అంతేకాదు.. తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ, కేంద్ర ప్రభుత్వం గతవారమే రివ్యూ పిటిషన్ సైతం దాఖలు చేసింది.
ఈ కేసులో కోర్టు జారీ చేసిన ఆదేశాలు లోపభూయిష్టమని, దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్లో కేంద్రం విజ్ఞప్తి చేసింది. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే దోషులను విడుదల చేయడమనేది.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని, న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే ఈ తరహా వ్యవహారాల్లో.. కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యమని పేర్కొంది.