Recent Big Exits In Congress Party : గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అసలు ఏమైంది. ఎదురు దెబ్బలు తగులుతున్నా.. పార్టీ మారేందుకు సిద్ధంగా లేదా.. దీంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలకు మారుతున్నారా..? ఇది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో దినదినం పతనావస్థకు చేరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు లేవు.. చివరకు అధ్యక్షుడిని కూడా ఎన్నుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. వరసగా 2014, 2019 ఎన్నికలలో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఘోరంగా ఓడిపోతోంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎక్కడా అధికారంలోకి రాలేదు. ప్రస్తుతం చత్తీస్ గఢ్, రాజస్థాన్ లోనే సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భాగస్వామి పక్షంగా అధికారంలో ఉంది.
దాదాపుగా 50 ఏళ్లుగా పార్టీతో అనుబంధం ఉన్న కీలక నాయకుడు మాజీ కేంద్రమంత్రి, మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పార్టీని వీడటం కాంగ్రెస్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ.. పార్టీ పరిస్థితి, రాహుల్ నాయకత్వం గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గులాం నబీ ఆజాద్ ఒక్కడే కాదు. ఎంతో మంది కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారిలో కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో సీఎంలుగా పనిచేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఎంత మంచి నాయకులను వదులుకుందో అర్థం అవుతుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వైఎస్సార్సీపీ నేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు ఈ కోవకే చెందుతారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉండే కోటరీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతోంది. మరో కీలక నేత, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఆనంద్ శర్మ కూడా పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కాాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లోకి మారారు. ముఖ్యంగా ఛరిష్మా ఉన్న నాయకులను బీజేపీ తన పార్టీలోకి ఆహ్వనిస్తోంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలు వీరే:
కపిల్ సిబల్:
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు రావాలని ఆశించిన వ్యక్తుల్లో.. జీ-23 నేతల్లో ఒకరుగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
సునీల్ జాఖర్:
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న సునీల్ జాఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అన్ని పదవుల నుంచి తీసేసింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు.
అశ్వని కుమార్:
ఫిబ్రవరి నెలలో మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కూమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో 46 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు.
ఆర్పీఎన్ సింగ్:
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు ఆర్పీఎన్ సింగ్. నేను నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభిస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
హార్దిక్ పటేల్:
గుజరాత్ కాంగ్రెస్ లో కీలక నేత, పాటిదార్ ఉద్యమ నాయకుడు హర్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన గుజరాత్ ఎన్నికల ముందు పార్టీని వదిలారు.
వీరే కాదు.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు పొమ్మనలేక పొగబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఫలితంగా పంజాబ్ లో అధికారానికే దూరం అయింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింథియా కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో పౌరవిమానయాన మంత్రిగా పనిచేస్తున్నారు. జైవీర్ షెర్గిల్, జితిన్ ప్రసాద, ముకుల్ సంగ్మా, రిపున్ బోరా, లయిజిన్హో ఫలేరో ఇలా కాంగ్రెస్ పార్టీని వీడారు.