Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు సీఎంగా, అటు పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Delhi Accident: నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి దుర్మరణం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో చర్చించేందుకు బుధవారం రోజు అశోక్ గెహ్లాట్, సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేరళలో జరుగుతన్న రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’కు వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు చివరిసారిగా ఒప్పించేందుకు ఈ రోజు అశోక్ గెహ్లాట్ కొచ్చిన్ వెళ్లనున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడు అయితే సచిన్ పైలెట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా.. గెహ్లాట్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. సచిన్ పైలెట్ ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే తాను సీఎంగా కొనసాగుతానని.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ వేసే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని ఆయన కోరారు. ఒక వేళ అధ్యక్షుడిని అయినా..సీఎంగా కొనసాగాలనే పట్టుదలలో గెహ్లాట్ ఉన్నారు. సచిన్ పైలెట్ ఆశలకు గండి కొట్టాలని చూస్తున్నారు.
2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం తరువాత పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా సోనియాగాంధీనే ఉంటున్నారు. సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.