గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పనితీరు ఘోరంగా ఉండటం ఆ పార్టీ అధినాయకత్వానికి ఇప్పుడు అంతులేని వేదన కలిగిస్తోంది.
పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం కావటమే గాక, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లోని ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవటంలో కూడా ఘోర వైఫల్యం చెందింది. ఇక రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా పతనావస్తకు చేరిందనటంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుత రాజకీయ చిత్రంలో కాంగ్రెస్ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికలతో బీజేపీ మరింత బలంగా ముందుకుపోతోంది. కొత్త అవకాశాలకు దారులు తెరుస్తోంది.
పంజాబ్‌లో ఓటమితో కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వాటిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సొంతంగా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో జూనియర్ సంకీర్ణ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు గనుక కాంగ్రెస్ మారకపోతే.. అదే దానికి ముగింపు అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. అయితే కాంగ్రెస్ తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటుందా? లేదంటే మరింత దిగజారిపోతుందా అనేది ముందు ముందు మనం చూస్తాం.
గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన నేపథ్యంలో త్వరలో మేధోమథనం జరగబోతోంది. ఈ సందర్భంలో మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, అత్యంత బాధాకరమని సోనియా కలత చెందారు. తాను ఇతర నేతలతో కూడా మాట్లాడానని, పార్టీని బలోపేతం చేయడానికి సలహాలు తీసుకున్నానని చెప్పటం విశేషం. పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ఇటీవల సోనియా గాంధీతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే విధంగా నేతలంతా ఐకమత్యంగా ఉండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఐక్యత సాధించడం కోసం G-23 నేతలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణం అంతర్గత కలహాలేనని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం సోనియా ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. పార్టీలో ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏమైనా చేస్తానని సోనియా చెప్పటం విశేషం. ఐతే పార్టీని గాడిలో పెట్టే విషయమై ఇప్పటికే చాలా ఆలస్యమైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సోనియా ప్రయత్నాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో ఎంతవరకు సత్ఫలిస్తాయో చెప్పలేం.
మరోవైపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోగాంధీ కుటుంబ పాత్ర ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తోంది. దానికి స్పష్టమైన సమాధానం లేదు. రాహుల్ నాయకత్వం విషయంలో జి-23 గ్రూపు తీవ్రంగా విభేదించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో రాహుల్ కీలక పాత్ర పోషించాలని వారు అనుకోవటం లేదు. ఐతే, సోనియా, ప్రియాంక గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్‌లో రాహుల్‌నే కేంద్ర బింధువుగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ, ఆయన పార్టీ పగ్గాలు చేపట్టటానికి సుముఖంగా ఉన్నారా?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే G-23 నాయకుల గేమ్‌ప్లాన్ చాలా వరకు వచ్చే ఆగస్టులో రాహుల్ నాయకత్వ పగ్గాలు చేపట్టకపోవచ్చనే అంచనా మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన వారిని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంటే మాత్రం కాంగ్రెస్‌లో మరో రసవత్తర పోరు జరిగవచ్చు. అప్పుడు పార్టీ పాత కాపును పక్కన పెడుతుందా? గాంధీ కుటుంబానికే పట్టం కడతుందా అనేది తేలిపోతుంది. ఐతే ఈ పోరులో గాంధీలదే పైచేయి కావచ్చు. ఎందుకంటే సమ్మతివాదులు , మార్పు కోరుకుంటున్న నేతలలో ఎవరికీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టే ఛరిష్మా లేదు. కనుక వారిపై పార్టీకి పెద్దగా ఆశలు లేవు.
నిజానికి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ రాజకీయ జయాపజయాలు కేవలం ఒకటి రెండు కారణాలపై అధారపడి ఉండవు. సామాజిక, రాజకీయ, సంస్థాగతమైన అనేక సంక్లిష్ట అంశాలు పార్టీ ప్రస్తుత సంక్షోభానికి, దాని క్రమానుగత క్షీణతకు కారణమయ్యాయి. ప్రస్తుత పార్టీ నాయకత్వం తీరు ఆ కారణాలలో ఒకటి. అలాగే, ప్రస్తుత పొలిటికల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రజలతో కాంగ్రెస్ పార్టీ బలంగా కనెక్ట్ కాలేకపోతోంది. బీజేపీ హిందుత్వ అంశాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవటం, వరుస ఎన్నికల పరాజయాలతో క్యాడర్‌లో నిరాశ నిస్పృహలు.. ఇదే సమయంలో గాంధీ కుటుంబానికి ఓట్లు కొల్లుగొట్టే శక్తి తగ్గిపోవటం… ఇలా ఇవి వేటికి అవే హస్తం పార్టీ పతనానికి దోహదడ్డాయి.
అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఏమిటంటే కాంగ్రెస్ ఎంత పతనమైనా ఇప్పటికీ దేశంలో ఆ పార్టీకి 700కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ 1300 మంది ఎమ్మెల్యేలలో ఈ సంఖ్య దాదాపు 60 శాతం. కాంగ్రెస్ పాద ముద్ర దేశ వ్యాప్తంగా ఉందని చెప్పటానికి ఇది చాలు. ఐతే, దీనిని రాజకీయంగా క్యాష్ చేసుకోగల సమర్ధవంతమైన నాయకులు ఆ పార్టీకి లేరు.
కాంగ్రెస్ పునరుద్ధరణకు షార్ట్ కట్స్ లేవు. ఇది దీర్ఘకాలంగా సాగే ప్రక్రియ. బహుశా త్వరలో జరిగే సంస్థాగత ఎన్నికలు ఆ మార్పుకు ఉత్ప్రేరకంగా పనిచేయవచ్చు. రాబోయే నెలల్లో కాంగ్రెస్ నాయకులు పార్టీ పునరుజ్జీవనానికి చాలా కష్టపడాల్సి ఉంది. ఎందుకంటే పార్టీ పునర్నిర్మాణం లేకుండా మతం, జాతీయవాదం అనే రెండు శక్తివంతమైన అంశాల కలయికతో ఓటర్లతో బీజేపీకి గల బలమైన భావోద్వేగ బంధాన్ని కాంగ్రెస్ ఎదుర్కోలేదు. దీని ఎదుర్కోవాలంటే లౌకికవాదంపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకాన్ని పలుచన చేయని, అదే సమయంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలగని.. విభజన రాజకీయ ప్రమాదాల గురించి ప్రస్తావించే తెలివైన, వాస్తవిక, ఆచరణాత్మక ఆలోచనలు అవసరం. ఇది కాంగ్రెస్ నాయకత్వ సమస్యని పరిష్కరించడమే కాకుండా దాని చిరకాల ప్రత్యర్థిని ఓడించగలిగే శక్తిని కూడగట్టుకునేలా చేస్తుంది. అప్పుడు గానీ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో 200కు పైగా సీట్లలో బీజేపీతో ప్రత్యక్ష పోటీలో ఉన్న కాంగ్రెస్ కథ ఆశాజనకంగా మారదు.