Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు సంప్రదించలేదని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
కాగా.. తనను ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని మహిళ ఫిర్యాదు చేయడంతో ఎల్డోస్ కున్నప్పిల్లిపై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి అన్ని సోర్సెస్ ఉపయోగించి ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ప్రయత్నించామని కానీ కుదరలేదని ఆయన అన్నారు. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని సతీశన్ అన్నారు.
Read Also: Freebies: రాజకీయ “ఉచితాల”పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు “నో”
ఈ అంశంపై కేరళ పీసీసీ స్పష్టమైన వైఖరితో ఉందని.. అధికార సీపీఎం, వారి నాయకులపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీని కాపాడుకునేలా చేసేదని.. కాంగ్రెస్ అలా చేయదని ఆయన అన్నారు. కేరళ పీసీసీ ఎమ్మెల్యే నుంచి వివరణ కోరిందని.. దాని కోసం చూస్తున్నామని సతీశన్ అన్నారు. ఒక మహిళ న్యాయం కోసం సమాజం ముందు నిల్చుందని దానిని విస్మరించలేమని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. సీఆర్పీసీ 164 కింద్ర మెజిస్ట్రేట్ కు మహిళ వాంగ్మూలం ఇస్తుందని క్రైం బ్రాంచ్ డీవైఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటన అసెంబ్లీ వెలుపన జరిగింది కనుక.. స్పీకర్ కు చెప్పాల్సిన అవసరం లేదని పోలీస్ అధికారులు తెలిపారు.
పెరుంబవూర్ ఎమ్మెల్యే తనను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనపై ఎమ్మెల్యేతో పాటు అతని సహాయకుడు, స్నేహితుడితో సహా ముగ్గురిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసును పరిష్కరించేందుకు సదరు మహిళకు ఎమ్మెల్యే రూ. 30 లక్షలు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు.