Supreme Court Rejects Urgent Hearing of Pleas Over Political Freebies: ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలు వాగ్ధానం చేసే ఉచితాలపై అత్యవసర విచారణ జపరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఉచితాలపై అత్యవసరంగా విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, న్యాయమూర్తి హేమంత్ గుప్తాతో కూడిన దర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. న్యాయమాది అశ్విని ఉపాధ్యాయ్ గుజరాత్ ఎన్నికలు వస్తున్నాయని.. పార్టీలు బాధ్యతారాహిత్యమైన వాగ్ధానాలు చేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీజేఐ లలిత్ మాట్లాడుతూ.. దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత హామీలు ఇస్తున్నాయని..ఇది దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందంటూ గతంలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై అప్పటి సీజేఐ ఎన్వీ రమణ విస్తృత చర్చ అవసరమని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు చేసే వాగ్ధానాలను అడ్డుకోలేమని వ్యాఖ్యానించింది. ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయా పార్టీలనింటి మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్పా.. ఈ కేసులో ఏమి జరగదని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గతంలో సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ ఆదేశించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు పార్టీలు ఇచ్చే హామీలు ఉచితాలు కావని, ప్రజా సంక్షేమ పథకాలని వ్యాఖ్యానించారు. ఉచిత నీరు, విద్యుత్, ఉచిత రవాణా వంటివి రాజకీయ ఉచితాలు కావని.. సమాజంలో అసమానతలను తగ్గించే సంక్షేమ పథకాలని ఆప్ తెలిపింది.
న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ లో అహేతుకమైన ఉచితాలు పంపిణీ చేస్తామని వాగ్ధానాలు చేస్తున్న పార్టీల ఎన్నికల గుర్తులను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు ఏకపక్షంగా వాగ్ధానాలు చేస్తున్నాయని.. అహేతుకమైన ఉచితాలను ఇవ్వడం, ఓటర్లను ఆకర్షించడం లంచంతో సమానమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను ఉచితాలు దెబ్బతీస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.