బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ మహిళా నేత, అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ పని తీరును తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేశారు. కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని.. అందుకు తగిన విధంగా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 10, 20, 30 ఏళ్ల క్రితం పని చేసినట్లుగా ఇప్పుడు పని చేయలేకపోతున్నట్లు వాపోయారు.

ప్రస్తుతం వేరే ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని.. ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడు వెళ్తున్న మార్గం సరైంది కాదన్నారు. ప్రస్తుత వ్యవస్థతో పోరాడే మార్గం వేరేగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఎక్స్‌లో ఒక పోస్ట్ పెడుతూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి తప్పుడు సలహాలు ఇస్తున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగితే.. ఎవరు తప్పుడు సలహాలు ఇస్తున్నారో.. సరైన సలహాలు ఇస్తున్నారో తనకు తెలియదని.. ఎన్నికల్లో మాత్రం గెలవడం లేదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఎంత అద్దె చెల్లించారంటే..!
ఇటీవల వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చూసింది. ‘ఓట్ల చోరీ’ పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టినా ఓట్లు రాబట్టలేకపోయారు. దారుణమైన ఫలితాలను చూశారు. కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో విపక్ష కూటమి 35 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఎంఐఎం 6 స్థానాలు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!