BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్‌ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
కర్ణాటక క్యాబినెట్ కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ(KTPP) చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధాన సభలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కేటీపీపీ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సవరణ చేయాలని నిర్ణయించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్చి 7న కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ సమర్పిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం ఇప్పుడు ముస్లింలకు కేటగిరి -2బి అనే కేటగిరీ కింద రిజర్వ్ చేస్తామని చెప్పారు.
Read Also: VC Sajjanar : బెట్టింగ్ యాప్‌లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు
ఈ రిజర్వేషన్లపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ఒక వర్గానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి దృష్టిని కేవలం రెండు విషయాలపైనే కేంద్రీకరిస్తుందని ఆరోపించారు. ఒకటి అవినీతి, రెండోది బుజ్జగింపు రాజకీయాలు అని మాల్వియా ఎక్స్‌లో విమర్శించారు. మతం ఆధారంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి, ప్రయోజనాలను అందించడానికి భారత రాజ్యంగం మద్దతు ఇవ్వదని మాల్వియా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అంటేనే న్యూ ముస్లిం లీగ్ అని విమర్శించారు.