Actor Vijay: తమిళనాడు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది.
టీవీకే ఎవరిలో చేతులు కలుపుతుందనే సందేహాల నడుమ, ఫిలిక్స్ మాట్లాడుతూ.. “లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో, మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమే. రాహుల్ గాంధీ, మా నాయకుడు(విజయ్) కూడా స్నేహితులు,” అని ఆయన అన్నారు. అయితే, ఇది అంత సులభం కాదని, ఏదైనా ఒప్పందానికి రావడానికి ముందు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పొత్తులపై ప్రతిష్టంభనకు తమిళనాడు కాంగ్రెస్ కారణమని నిందించారు.
Read Also: US Attacks Venezuela: అమెరికా చెరలో వెనిజులా అధ్యక్షుడు.. “పిరికిపంద” అంటూ ఖండించిన మిత్ర దేశాలు..
“కాంగ్రెస్ మరియు టీవీకే పొత్తు పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే, నేను చూస్తున్నంతవరకు, ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నాయకత్వ వ్యక్తిగత ప్రయోజనాలు, బహుశా వ్యాపార లేదా ఆర్థిక ప్రయోజనాలు, టీవీకేతో చర్చల్ని ప్రారంభించకుండా వారిని నిరోధిస్తున్నాయి” అని చెప్పారు. టీవీకే, కాంగ్రెస్ చేతులు కలిపితే మైనారిటీ, బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకృతం చేయవచ్చని అన్నారు.
త నెల డిసెంబర్ 25న కాంగ్రెస్ కార్యకర్తలు టీవీకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటి నుంచే ఈ రెండు పార్టీలు చేతులు కలపబోతున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. 2024 అక్టోబర్‌లో స్టార్ యాక్టర్ విజయ్ టీవీకేను ప్రారంభించారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం, కాంగ్రెస్ డీఎంకేతో పొత్తులో ఉంది.