US Attacks Venezuela:వెనిజువెలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మడురోను పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మడురో భార్యను కూడా అదుపులోకి తీసుకుని అమెరికాలో బంధించినట్లు స్పష్టం చేశారు.తమ దేశ ప్రధానిని అదుపులోకి తీసుకోవడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో శనివారం తెల్లవారుజామున స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. విదేశీ సైన్యాల ఉనికిని వెనిజువెలా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మడురోను పట్టుకుని దేశం నుంచి తరలిస్తున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అమెరికా దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని, మృతులు, గాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నామని పడ్రినో తెలిపారు.
READ MORE: Bangladesh: “హిందూ ఎస్ఐ సంతోష్‌ను చంపింది నేనే”.. యూనస్ పాలనలో అరాచకం..
అయితే.. తాజాగా వెనిజువెలాకు మిత్రదేశాలైన ఇరాన్, క్యూబా అమెరికా సైనిక దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది వెనిజువెలా జాతీయ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతపై ఘోరమైన ఉల్లంఘన అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అక్రమ దాడులను వెంటనే ఆపేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను జవాబుదారుల్ని చేయాలని కోరింది. మరోవైపు.. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పరిల్లా కూడా అమెరికా వెనిజువెలాపై చేస్తున్న సైనిక దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. కరాకస్ సహా పలు ప్రాంతాలపై జరుగుతున్న బాంబు దాడులు పిరికిపంద చర్యలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వెనిజువెలా అమెరికాపై గానీ, ఇతర ఏ దేశంపై గానీ దాడి చేయలేదని అభిప్రాయపడ్డారు.
కాగా.. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) CPI(M) కూడా అమెరికా చర్యలను ఖండించింది. ఇవి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్, జాతీయ సార్వభౌమత్వ సూత్రాలకు విరుద్ధమని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. స్వతంత్ర దేశాలను అస్థిరపరిచి, వాటి వనరులను నియంత్రించాలనే వాషింగ్టన్ దీర్ఘకాల విధానానికే ఇవి నిదర్శనమని పేర్కొంటూ, వెనిజువెలా ప్రజలు, ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించింది.