Tahawwur Rana: 26/11 ముంబై దాడుల ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ తహవూర్ రాణాను అమెరికా, భారత్‌కి అప్పగించింది. గురువారం భారత అధికారులు రాణాను ఇండియాకు తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత, భద్రతా అధికారులు విస్తృత భద్రతను ఏర్పాటు చేశారు. భారత్ రాకుండా అనేక పర్యాయాలు అమెరికా కోర్టుల్ని ఆశ్రయించిన రాణాను, భారత్ తీసుకురావడానికి అధికారులు చేసిన కృషి ఫలించింది.
ఇదిలా ఉంటే, రాణా అప్పగింతపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముంబై దాడుల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు.
Read Also: Vivo V50e: 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్స్, 50MP కెమెరాతో లాంచైన వివో V50e
‘‘తాజ్ హోటల్ పై ఉగ్రవాద దాడి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, కానీ కాంగ్రెస్ నిందితులపై ఏమీ చేయలేదు’’ అని గోయల్ విమర్శించారు. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి కాంగ్రెస్ బిర్యానీ తినిపించిందని ఆరోపించారు. దోషులను న్యాయం ముందు నిలబెట్టాలనే మోడీ సంకల్పం ఫలించిదని చెప్పారు. ముంబై ప్రజలు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని గోయల్ అన్నారు. శివసేన(యూబీటీ), ఉద్ధవ్ ఠాక్రే బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముస్లిం అయిన వ్యక్తిన సంజయ్ రౌత్ సమర్థిస్తాడు, ఆ వ్యక్తి నేరం చేసినప్పటికీ, అతడినే సమర్థిస్తున్నాడని అన్నారు.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ జాతీయుడైన రాణా, అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా సుప్రీంకోర్టు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతడిని ప్రశ్నించనున్నాయి. ముంబైలోని బైకుల్లా జైలులోని ప్రాపర్టీ సెల్ కార్యాలయంలో లేదా ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలోని యూనిట్ 1 కార్యాలయంలో విచారణ కోసం ముంబైకి తీసుకురావచ్చని అధికారులు తెలిపారు. ఆర్థర్ రోడ్డు జైలులోని బ్యారక్ నంబర్ 12లో అతడిని ఉంచే అవకాశం ఉంది. 2012లో అజ్మల్ కసబ్ కూడా ఈ జైలులోనే ఉన్నాడు. ఇక్కడే ఉరితీయబడ్డాడు. కసబ్‌ని ఉంచిన ఇదే జైలులో రాణాను ఉంచే అవకాశం ఉంది.