Cocaine: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. పోర్టులోని ఓ ఓడలో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పారదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద లంగర్ వేసి ఉన్న ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయని వారు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ బరువు 22 కిలోలు ఉందని అధికారులు వెల్లడించారు.
ముందుగా వాటిని క్రేన్ ఆపరేటర్ గుర్తించాడు. అయితే వాటిని పేలుడు పదార్థాలుగా భావించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో డ్రగ్స్ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో కొకైన్‌గా నిర్థారించారు. ఎంవీ డెబి అనే కార్గో షిప్ ఈజిప్టు నుంచి ప్రయాణం ప్రారంభించింది. ఇండోనేషియాలోని గ్రెసిక్ ద్వారా ఇక్కకు చేరుకుంది. ఇక్కడి నుంచి స్టీల్ ప్లేట్లతో డెన్మార్క్‌కి బయలుదేరాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘన్‌లో మతాధికారులపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి
‘‘ఓడలోని క్రేన్ నుండి ఇరవై రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాము. ప్రత్యేక కిట్‌ను ఉపయోగించి పరీక్షించిన తర్వాత పౌడర్ లాంటి పదార్ధం కొకైన్‌గా నిర్ధారించబడింది. స్వాధీనం చేసుకున్న పదార్థం యొక్క అంతర్జాతీయ మార్కెట్ ధర రూ. 200 కోట్ల నుండి రూ. 220 కోట్ల మధ్య ఉంటుంది.’’ అని రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ మధాబ్ చంద్ర మిశ్రా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఓడలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ దర్యాప్తులో సహకరించేందుకు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి కస్టమ్స్ టీంను పారాదీప్ తరలించినట్లు వెల్లడించారు.