Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్‌లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
మరణించిన వారిలో నలుగురు మహిళలు ఉండగా.. ఇద్దరు మతాధికారులు ఉన్నట్లు తాలిబాన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు మతాధికారులపై దాడులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. కాల్పుల లక్ష్యం షియా మతాధికారులే కావచ్చని చెప్పారు.
Read Also: Telangana Exit Polls 2023: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం పడిపోయిన తర్వాత 2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరుచుగా దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా మైనారిటీలైన షియాలు, హజారా వర్గంపై దాడికి ఆత్మహుతి, ఉగ్రవాద దాడులు చేస్తున్నారు. గతంలో పలు మసీదులతో పాటు షియాలు, మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో దాడులు చేశారు.