అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో భవిష్యత్ రాజకీయాలు బీజేపీ వర్సెస్ ఆప్ గా మారతాయని చెప్పడానికి పంజాబ్ ఫలితం ఒక సంకేతం.
మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. ఈ గెలుపు తాలూకు క్రెడిట్ చాలా వరకు సీఎం యోగి ఆధిత్యనాథ్‌కు దక్కుతుంది. ఐదేళ్ల ఆయన పాలనకు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 2017లో ప్రధాని మెడీ ప్రభంజనంతో బీజేపీ అఖండ విజయం సాధ్యపడింది. కానీ ఈ ఎన్నికలు యోగీ పాలనకు పరీక్ష పెట్టాయి.
ఎంత గొప్పగా పాలించినా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత తప్పదు. పైగా ఇప్పుడు యూపీలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి గొప్ప అనుకూలంగా ఏమీ లేవు. సాగు చట్టాల అనంతర పరిస్థితులతో రైతులు బీజేపీకి వ్యతిరేకమయ్యారు. కొందరు ముఖ్య ఓబీసీ నేతలు ఎన్నికల ముందు పార్టీని వీడారు. అయినా ఆయన బీజేపీ ప్రచార రథాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించి విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్‌లో యోగీ గెలుపుతో బీజేపీలో కొత్త లెక్కలకు తెరలేస్తుందని రాజకీయ పరిశీలకలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో నాయకత్వ చర్చ ఉండకపోవచ్చు. కారణం, ఇప్పటికీ ప్రధాని మోదీనే ఆ పార్టీలో తిరుగులేని నాయకుడు. కానీ, ఆయన తరువాత ఎవరు అనే ప్రశ్న బలంగా ముందుకు వస్తుంది. నిజానికి దీనిపై ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తోంది. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి వంటి వారు నెంబర్ టూ రేస్‌లో ఉన్నారు. కానీ, మోడీ తరువాత ఎవరని అడిగితే ఎవరైనా చెప్పే పేరు అమిత్ షా. అయితే ఇప్పుడు ఆయనకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానథ్ రూపంలో బలమైన పోటీదారు ముందుకు వచ్చాడు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొటా బొటి మెజార్టీతో గెలిచినా కొద్ది రోజుల తరువాత సీఎం మార్పుకు అవకాశం ఉండేది. ఇకవేళ ఓడిపోయి ఉంటే యోగి పొలిటికల్ ఛాప్టర్ ముగిసిపోయేది. కానీ ఈ రెండూ జరగలేదు. ప్రతికూల పరిస్థితులలో పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టాడు. దాంతో మోడీ తరువాత నేనే అనే మెసేజ్ ఇచ్చాడు. బీజేపీలో ఇప్పటి వరకు కరుడు గట్టిన హిందుత్వ నాయకుడిగా మోడీ మాత్రమే ఉన్నారు. కాని ఈ విషయంలో యోగి ఆయనను మించిపోయాడు. ఆయన ప్రచార తీరు చూసిన వారికి ఈ విషయం సులభంగా అర్థమవుతుంది.
తాజా విజయంతో సంఘ్ పరివార్ లో యోగి గ్రాఫ్ అమాంతం పైకి వెళుతుంది. 2024 ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. 2029 నాటికి ఆయనను ప్రధాని అభ్యర్థి రేస్‌లో నిలుపుతుంది. వాస్తవానికి, సంఘ్ పరివార్‌లో ఒక బలమైన వర్గం యోగి లాంటి వ్యక్తిని ప్రధాని పీఠంపై చూడాలని కోరుకుంటోంది. వారి కల నిజం కావటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
బీజేపీ ఏలుబడిలోని ఇతర ముఖ్యమంత్రులు, యోగీ ఆధిత్యనాథ్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వారిలా ఆయన సొంత రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. దేశ వ్యాప్తంగా హిందుత్వ పోస్టర్ బాయ్ ఆయన. ఎక్కడ ఎన్నికలు జరిగినా పోస్టర్లు, ఫ్లెక్సీలపై మోదీ, షాతో పాటు యోగి కూడా ఉంటారు. బీజేపీ శాశ్వత స్టార్ క్యాంపెయినర్లలో ఆయన ఒకరు. యోగిలోని కరడుగట్టిన హిందుత్వం ఆయనను మోడీకి సహజ వారసుడిగా నిలబెడుతుంది. ఇది అమిత్ కు ఆందోళన కలిగించే విషయం.
మోదీ-షా ధ్వయం గత ఇరవై ఏళ్లుగా రాజకీయంగా కలిసి ప్రయాణిస్తున్నారు. పార్టీ ఎదుగుదలకు ఆయన ఎంతో కష్టపడ్డాడు. గుజరాత్ హోంమంత్రి నుంచి కేంద్ర హోంమంత్రి వరకు ఎదిగారు. 2014లో ఉత్తరప్రదేశ్‌లో ఇంఛార్జిగా మోదీ గెలుపుకు బాటలు వేశారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి రెండో దఫా గెలుపుకు వ్యూహ రచన చేశారు. తరువాత మోడీ ప్రభుత్వంలో హోం మంత్రిగా కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దులో కీలక భూమిక పోషించాడు.
కానీ, రాజకీయ లెక్కలు మరోలా ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆయన పుట్టింది ఉత్తరాఖండ్‌లో కావచ్చు. కానీ ఆయన జీవితం అంతా యూపీలోని గోరఖ్‌పూర్‌లో సాగింది. మోడీతో పాటు, ఆయన దేశం మూల మూలనా హిందుత్వ ముద్ర వేశారు. అన్నిటికి మించి దేశ ప్రధాని కావాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది. దానిని ఆయన దాచిపెట్టడు. పైగా దానిని సాధించటానికి ఓ ఠాకూర్ లా పోరాడతాడు.
ఇప్పటి వరకు యోగిని కట్టడి చేయడం బీజేపీ అధిష్టానికి కష్టమని తేలిపోయింది. ప్రధానమంత్రి విశ్వాసాన్ని చూరగొన్న బ్యూరోక్రాట్ ఎకె శర్మను యుపికి పంపడం ద్వారా బీజేపీ పెద్దలు ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ అధికారిగా మారిన ఎమ్మెల్సీని డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు. కానీ యోగికి ఇవేమీ ఉండవు కాబట్టి ఆ ప్లాన్ అటకెక్కింది. ఇక ఇప్పుడు ఆయనను కట్టడి చేయటం అధిష్టానికి సాధ్యమా?
తాజా గెలుపుతో యోగి డిల్లీ పీఠానికి గురి పెడతారు. మోదీ మాదిరిగానే ఆయనకు ఒక వర్గం ప్రజలలో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మత తత్వ రాజకీయాలలో మోదీ, షా కన్నా యోగి నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు. అన్నింటిని మించి 80 శాతం హిందువులు తన వెనక నిలబడటానికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అదే ఆయనను ఏనాటికైనా ప్రధాని పీఠం ఎక్కించవచ్చు.