కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి మార్పులేదని సిద్ధరామయ్య అంటున్నా.. మార్పు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అంటూ డీకే.శివకుమార్ వర్గీయులు అంటున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజాగా ఈ పంచాయితీ ఢిల్లీలో కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Priyanka Jawalkar : జోరు వాన ఓ వైపు.. ప్రియాంక అందాల వేడి మరోవైపు
జూలై22న ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఇద్దరు సీనియర్ కర్ణాటక ప్రభుత్వాధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (ఎస్డిఓ) మోహన్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఎస్డిఓ హెచ్ ఆంజనేయ మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది. అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (SDO) మోహన్ కుమార్ తనపై దాడి చేశారని హెచ్ ఆంజనేయ ఆరోపించారు. ప్రమీల అనే సీనియర్ అధికారి సహా ఇతర సిబ్బంది సమక్షంలో తనను షూ తీసుకుని కొడతానని బెదిరించారని ఆరోపించారు. మోహన్ కుమార్ అసభ్యకరమైన భాషను ఉపయోగించడమే కాకుండా, షూతో దాడి చేస్తానని బెదిరించారని ఆంజనేయ లిఖితపూర్వక ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇమ్కోంగ్లా జమీర్, కర్ణాటక ప్రధాన కార్యదర్శి షాలిని రజనీష్లకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మోహన్ కుమార్ వేధింపులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పదే పదే అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన కార్యదర్శి రజనీష్ అధికారిక విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ కమిషనర్ నుంచి నివేదికను కోరారు.
ఇది కూడా చదవండి: Kingdom : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే !
ఈ పరిణామం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలిక మొదలైందని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకత్వం నియంత్రణ కోల్పోయిందని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ తెలిపారు. రెండు వర్గాలు బహిరంగంగానే కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులే కొట్టుకుంటే.. ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ధ్వజమెత్తారు.
