బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదంపై ఇస్లామిక్ ప్రపంచం భారత్ కు తమ నిరసననను తెలియజేశాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, యూఏఈ, సౌదీ ఇలా చాలా దేశాలు భారత రాయబారులకు నిరసన తెలిపాయి. దీనికి బదులుగా ఇండియాకు కూడా వివరణ ఇచ్చింది. వ్యక్తి గత వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని హితవు పలికింది.
ఇదిలా ఉంటే నుపుర్ శర్మ వ్యాఖ్యలపై చైనా స్పందించింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మీడియాతో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘‘విభిన్న నాగరికతలను, మతాలను ఒకరినొకరు గౌరవించుకోవాలని, కలిసి జీవించాలని చైనా ఎల్లప్పుడూ విశ్వసిస్తుందని.. ఒకరి స్వంత నాగరికతకు ఇతర నాగరికతల మధ్య తేడాలను బాగా అర్థం చేసుకోవడం, సామరస్యపూర్వక సహజీవనాన్ని ప్రోత్సహించడం ఎల్లప్పుడూ ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు.
డ్రాగన్ పలుకులపై ఇండియా స్పందించాల్సి ఉంది. అయితే జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్గర్ ముస్లింలను అణిచివేస్తున్న చైనా, ఇతర దేశాలకు సూక్తులు వల్లిస్తోందని విదేశాంగ నిపుణులు అనుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఉయ్గర్ ముస్లింలను అత్యంత దారుణంగా మతం పేరటి అణిచివేస్తోంది. వారిని జైళ్లలో వేయడంతో పాటు మైండ్ వాష్ కార్యక్రమాలను చేపడుతోంది. పాశ్చాత్య దేశాలు చైనా చేస్తున్న దురాగతాలపై ఆరోపణలు చేస్తున్న వాటిన్నింటిని పట్టించుకోవడం లేదు. తాను చేయాలనుకున్నది చేస్తోంది.