6th-generation fighter Jets: చైనా ఇటీవల రెండు 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను పరీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ పరిణామం పొరుగు దేశమైన భారత్‌కి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం భారత్ వద్ద కనీసం 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు కూడా లేదు. ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటల్ జెట్లు 4.5వ జనరేషన్‌కి చెందినవి. చైనా వద్ద నుంచి పాకిస్తాన్ 5వ జనరేషన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయబోతుందని వార్తలు ఇటీవల వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ వార్త చైనా, పాకిస్తాన్‌లను టెన్షన్ పెడుతోంది. బల్గేరియన్ మీడియా నివేదిక ప్రకారం.. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ 6వ-జనరేషన్ యుద్ధవిమానం అభివృద్ధి చేసే లక్ష్యంతో ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్(FCAS) కార్యక్రమంలో చేరాలని భారతదేశాన్ని ఆహ్వానించాయి. ఇదే విధంగా యూకే, జపాన్, ఇటలీ తమ గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్(GCAP)లో చేరాలని భారత్‌కి ఆఫర్ చేశాయి. ఈ రెండు ప్రాజెక్టులు ఎయిర్ డిఫెన్స్‌లో భారత్‌ని చైనాకు ధీటుగా మారుస్తాయని, ఆ దేశాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు.. కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల ఆందోళన..
స్వదేశీ AMCA ప్రాజెక్ట్‌లో ఇండియా బిజీ:
ప్రస్తుతం భారత్ స్వదేశీ అడ్వాన్సుడ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(AMCA)తో బిజీగా ఉంది. అధునాతన ఏవియానిక్స్, సూపర్‌సోనిక్ క్షిపణి సామర్థ్యాలతో ఐదవ-తరం స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్మించే పనిని పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలో భారత స్వావలంబనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. FCAS లేదా GCAP ప్రోగ్రామ్‌లలో చేరడం ద్వారా, భారతదేశం అధునాతన సాంకేతికతను యాక్సెస్ చేయగలదు. డిఫెన్స్ రంగంలో భారత్‌ని గ్లోబల్ ప్లేయర్‌గా మార్చగలవు. అయితే, ఈ రెండు విదేశీ ఆఫర్లను భారత్ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
AMCA అనేది భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన రక్షణ ప్రాజెక్ట్, దీనిని DRDO మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సుఖోయ్-57 మరియు ఎఫ్-35 వంటి ఐదవ తరం జెట్‌లను అధిగమించడం దీని లక్ష్యం. ఇది 5వ-6వ జనరేషన్ల మధ్య గ్యాప్‌ని తగ్గిస్తుంది. ఇది స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు, ఏఐ ఎనబుల్డ్ డిసిషన్ మేకింగ్, లేజర్ ఆయుధాల వాడకం వంటి టెక్నాలజీని కలిగి ఉంటుంది.
భారత్ 2035 నాటికి మొదటి AMCA నమూనాను పూర్తి చేయాలని మరియు 2040 నాటికి ఆరవ తరం సామర్థ్యాలను ఇంటిగ్రేట్ చేయాలని యోచిస్తోంది. అయితే, చైనా ఇప్పటికే 6వ జనరేషన్ జెట్లను పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో టైమ్ ఫ్రేమ్ అనేది భారత అవసరాలకు విరుద్ధంగా ఉంది.