Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ప్రసగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ మారితే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అరవింద్ కేజ్రీవాల్.. తన పార్టీలో ఫిరాయింపులు లేవని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన ”ఆపరేషన్ కమలం” ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను ఈ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నిజాయతీపరులని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆయన విమర్శించారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లు చొప్పున కొనేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయని.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.20 కోట్లు ఇస్తామంటూ.. 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని.. కానీ ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని.. వారిని కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్‌ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
అంతకు ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష శాసనసభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు.