Cheetahs Coming To India.. PM Narendra Modi will release: భారతదేశంలో అంతరించిపోయిన చిరుతలను నమీబియా నుంచి తెప్పిస్తోంది భారత ప్రభుత్వం. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ వారం నమీబియా నుంచి ఎనిమిది చిరుతలు భారతదేశానికి రానున్నాయి. 10 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నమీబియా నుంచి ఇండియాకు ఈ శుక్రవారం జైపూర్ కు చేరనున్నాయి. ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడవి కాగా..మూడు మగ చిరుతలు ఉన్నాయి.
నమీబియా నుంచి జైపూర్ చేరుకున్న తర్వాత వీటిని ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ లో మరుసటి రోజు సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ కు చేరుకుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటని ప్రధాని మోదీ చేతుల మీదుగా కునో నేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కునో నేషనల్ పార్క్ ఈ చిరుతలకు ఆశ్రయం ఇవ్వనుంది.
Read Also: Moonlighting: ఇన్ఫోసిస్, విప్రో బాటలో ఐబీఎం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరి కోసం 10 అడుగుల ఎత్తులో ఫ్లాట్ ఫారమ్ ఏర్పాటు చేశారు. చిరుతలను ఈ ప్లాట్‌ఫారమ్ క్రింద ఆరు అడుగుల బోనులో ఉంచుతారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బోను గేట్లను తెరిచి ప్రధాని మోదీ చిరుతలను నేషనల్ పార్క్ లో ప్రవేశపెడతారు.
చిరుతలు 1952లో భారత దేశం నుంచి అంతరించిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేటాడటం వల్ల ఇవి అంతరించిపోయాయి. ఆఫ్రికన్ చిరుతలను జాగ్రత్తగా ఎంచుకున్న ప్రాంతంలో ప్రవేశపెట్టవచ్చని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టడినికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని తర్వాత దక్షిణాఫ్రికా నుంచి మరిన్ని చిరుతలను ఇండియా తీసుకురావడానికి ప్రభుత్వ యోచిస్తోంది.