Truckers Strike: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టంపై ట్రక్కులు, బస్సు, లారీలు, ట్యాంకర్ల డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో ఎక్కువ కాలం శిక్షతో పాటు జరిమానా భారీగా ఉండటాన్ని వారు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తు్న్నారు. పలు నగరాల్లో రోడ్లపై ఆందోళనలు చేశారు. అయితే డ్రైవర్ల సమ్మె వల్ల సామాన్య ప్రజానీకంలో భయాలు మొదలయ్యాయి. ఆందోళన నేపథ్యంలో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా విధులకు రాకపోవడంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని భయపడుతున్నారు.
ఈ భయాల నేపథ్యంలో దేశంలో అన్ని చోట్ల వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూసి ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పెట్రోల్, డిజిల్‌కి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడటంతో స్థానిక అధికారులు పరిమితి విధిస్తున్నారు. చండీగఢ్‌లో ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా 2 లీటర్లు లేదా రూ. 200 వరకు పరిమితి విధించారు. ఇక కార్ల వంటి ఫోర్ వీల్ వాహనాలకు 5 లీటర్లు లేదా గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే ఇంధనాన్ని పోస్తున్నారు.
ఇంధన సరఫరాలో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినందున ఇంధనం అందరికి లభించేందుకు పరిమితి విధించినట్లు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రతీ బంకు నిర్వాహకులు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. విధించిన ఆంక్షలకు వినియోగదారులు సహకరించాలని ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు పంజాబ్ మరియు హర్యానాల సమన్వయంతో చండీగఢ్‌కు ఇంధన సరఫరాను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.