Chances High Of Big Earthquake In Himalayas: హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం పశ్చిమ నేపాల్ లోని మారుమూల ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఆరుగురు మరణించారు. ఈ భూకంప ప్రకంపనలు భారత్ లో కూడా సంభవించాయి. ఉత్తరాఖండ్ తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయి ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ మాట్లాడుతూ.. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ మధ్య ఘర్షణ తీవ్రం అవుతోందని.. దీని కారణంగానే హిమాలయాల్లో భూకంపాలు సంభవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పలకల మధ్య ఘర్షణ వల్ల అపరిమిత శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది కొన్ని మిల్లీమీటర్ల మేర ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర వైపుగా ఆసియా టెక్టానిక్ ప్లేట్ ని నెట్టేస్తోంది. దీని వల్ల హిమాలయాల ఎత్తు కూడా కాలక్రమంలో మెల్లిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తరుచుగా హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
Read Also: Jos Buttler: ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు.. ఉండనివ్వం..!!
భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని.. అయితే ఇది ఒక రోజు తర్వాత జరగవచ్చు, లేకపోతే ఓ వందేళ్ల తరువాతైన ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనలతో సహా, గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలిలో, 2015లో నేపాల్‌లో భూకంపాలు సంభవించాయి.
భూకంపాల కోసం అన్ని చర్యలు తీసుకోవాలని.. ప్రతీ ఏడాది కనీసం ఒకసారైనా మాక్ డ్రిల్ నిర్వహించాలని.. వీటి ద్వారా భూకంపం వల్ల కలిగే నష్టాన్ని 99.99 శాతం తగ్గించవచ్చని అజయ్ పాల్ అన్నారు. తమ బృందాలను కూడా గ్రామాలు, పాఠశాలకలు పంపుతూ.. భూకంపం ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని వెల్లడించారు. భూకంప కదలికలను నమోదు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో దాదాపు 60 భూకంప అబ్జర్వేటరీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.