Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్‌లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్‌లో టీమిండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో తమ జట్టే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండకుండా చేసేందుకు తాము సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నాడు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
అయితే భారత జట్టు బలంగా ఉందని, టీ20 ఫార్మాట్‌లో చాన్నాళ్ల నుంచి భారత జట్టు నిలకడగా ఆడుతోందని బట్లర్ వివరించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో డెప్త్ ఉందని, ఆ జట్టులో టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారని, ఇండియన్ లైనప్ బాగుందని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. అతడు అత్యుత్తమ బ్యాటర్ అని ప్రశంసించాడు. సూర్యకుమార్, కోహ్లీ ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకుంటే టీమిండియా నిలువరించవచ్చని బట్లర్ అభిప్రాయపడ్డాడు. కాగా సెమీఫైనల్‌కు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లను గాయాల సమస్య వెంటాడుతోంది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్, కోహ్లీ స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదమేమీ లేదని బీసీసీఐ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఇంగ్లండ్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కూడా గాయాల బారిన పడ్డారు. దీంతో వాళ్ల స్థానంలో వేరే ఆటగాళ్లను ఇంగ్లండ్ తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మెడికల్ టీమ్‌పైన తమకు విశ్వాసం ఉందని.. వాళ్లిద్దరూ సెమీస్‌కు అందుబాటులో ఉంటారని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.