Doctors strike: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రతకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి హామీ ఇచ్చింది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే నిందితుడు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
Read Also: Vice President Jagdeep Dhankhar: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రశంసలు..
వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు సంబంధించి అన్ని చర్యలను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఢిల్లీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు & ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్ల సంఘాల ప్రతినిధులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను కలిసిన తర్వాత ఈ హామీలు వచ్చాయి. వారి భద్రతను నిర్ధారించడానికి సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలకు హామీలు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 26 రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ వర్కర్లను రక్షించడానికి ఇప్పటికే చట్టాన్ని రూపొందించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.