రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి సంబంధించి ఈనెల 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ‘కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలో ఉన్న 720 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనుంది.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ మేళా, సహజ వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రదర్శనను నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ ప్రచారంలో హైలైట్ చేయనున్నారు. ఈ ప్రచారానికి డెయిరీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా సహకరిస్తాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ స్కూల్‌ను కూడా ప్రారంభించనున్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో హరిత విప్లవం-ఆహార ఉత్పత్తిలో స్వావలంబన, ఉద్యాన పంటల అతిపెద్ద ఉత్పత్తిదారు- అల్లం, అరటి, మామిడి, బొప్పాయి, పసుపు పంట, తేనె ఉత్పత్తి, పంటల నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడం, వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి, సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ పెస్ట్ మేనేజ్‌మెంట్, వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్, GIS, డ్రోన్స్, బయోటెక్నాలజీ, వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం, విత్తనాలు, ఎరువుల్లో స్వయం సమృద్ధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
Congress: కాంగ్రెస్ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!