ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుబట్టింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది
కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. దీంతో భారత్‌లోనూ మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని లెక్కగట్టింది.
అయితే డబ్ల్యూహెచ్‌వో గణాంకాలను తాము తప్పుబట్టడం లేదని.. ఇందుకు అనుసరించిన విధానంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. చిన్నస్థాయిలో శాంపిల్ సైజు వివరాల ఆధారంగా కరోనా మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందని.. 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదని.. భారత్ నమూనా కచ్చితత్వంతో కూడుకుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం కరోనా మరణాల లెక్కింపునకు డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి.
Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..?