Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ఉన్న వారికి బియ్యం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కూడా ఇస్తోంది. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ 2020 నుంచి ఉచిత రేషన్‌ను పొడిగిస్తూ వస్తోంది.
Read Also: Delivery in Road : నడిరోడ్డుపైనే ప్రసవం.. ఆర్సీ పురంలో స్థానికుల సాయం
ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. డిసెంబర్ 31, 2023 వరకు ఉచిత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే బియ్యంపై కిలోకు రూ.3, గోధుమలపై రూ.2, చిరుధాన్యాలపై రూ.1 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను వసూలు చేయకుండా ఆహార ధాన్యాలను పేదలకు పూర్తి ఉచితంగా అందించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారు.