Lands For Job: బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం 25 వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్, బిహార్‌లోని పాట్నా, కతిహార్, మధుబనిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. గురుగ్రామ్ సెక్టార్ 65లోని వరల్డ్‌మార్క్ భవనంలో ఉన్న వైట్‌ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో కేంద్రంపై ఆర్జేడీ విరుచుకుపడింది. కొత్తగా ఏర్పాటైన బిహార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటన్న రోజునే దాడులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో భయపడుతున్నారని, బీజేపీ మినహా అన్ని పార్టీలు తమ వెంటే ఉన్నాయని, రాష్ట్రంలో మెజారిటీ తమకు ఉందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి అన్నారు. పార్టీ శాసనసభ్యులను బెదిరించేందుకే ఈ దాడులు చేశారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. “ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా వస్తారనే భయంతో వారు ఇలా చేస్తున్నారు” అని ఆర్జేడీ ఎమ్మెల్యే సునీల్ సింగ్ అన్నారు.
Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం
ఈ మేలో ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య, కుమార్తెలతో పాటు పలువురిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. మే నెలలో ఢిల్లీ, బీహార్‌లలో లాలూ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పనిచేసిన భోలా యాదవ్‌ను ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ జులైలో అరెస్టు చేసింది.