అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శరద్‌పవార్ పార్టీకి చెందిన ఎన్‌సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం దేశంలో ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇంకోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ల కార్డులు ఎలా పొందవచ్చునో అని శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్.. అక్టోబర్ 16న జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.. ఒక వెబ్‌సైట్‌లో నకిలీ ఆధార్ కార్డులను ఎలా తయారు చేస్తున్నారో.. నకిలీ ఓటర్ల నమోదు ఎలా చేస్తున్నారో చూపించారు. దీనిపై బీజేపీ సోషల్ మీడియా సెల్ కో-కన్వీనర్ ధనంజయ్ వాగస్కర్ ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదు ఆధారంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!
బోగస్ వెబ్‌సైట్ ద్వారా బోగస్ ఆధార్ కార్డులను సృష్టించడం ద్వారా సమాజంలోని రెండు వర్గాల మధ్య తప్పుదారి పట్టించడానికి.. విభేదాలు, శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ప్రతికూల ఫలితాలు వచ్చాయని… కానీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బోగస్ ఓటర్ల కారణంగా ఎన్డీఏ కూటమి గెలిచిందని రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ భేటీ వేళ చైనాకు ఊరట.. సుంకాలు తగ్గింపు
ప్రతికూల ఓటర్లను చనిపోయినట్లు చూపించారని.. అనంతరం చనిపోయిన వ్యక్తుల పేరుతో నకిలీ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్య 32 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని.. అంటే సంవత్సరానికి 6.5 లక్షల మంది ఓటర్లు లేదా నెలకు 54,000 మంది అదనంగా చేరారని తెలిపారు. కానీ 2024 లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఆరు నెలల్లోనే 48 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని వివరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని తన సొంత కర్జాత్ జామ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 14,292 మంది ఓటర్లు చేర్చారని.. 5,360 మంది పేర్లను తొలగించారని. 14,162 నకిలీ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. ఒక నియోజకవర్గంలోని ఓటరు ఆధార్ కార్డును వేరే నియోజకవర్గంలోని మరొక ఓటరు నమోదు కోసం ఉపయోగించి.. ఫొటో, పేరు మార్చిన సందర్భాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.