దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం సత్‌ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.
ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో కిలాడీ డీఎస్పీ.. స్నేహితురాలి ఇంటికొచ్చి ఏం చేసిందంటే..!
గురువారం బుసాన్ వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత భేటీ అయ్యారు. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా సమావేశంతో ఉద్రిక్తలు చల్లారినట్లుగానే కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని ట్రంప్ తెలిపారు. కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు ఆశాజనకంగా జరిగాయని పేర్కొన్నారు. ఇక అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100శాతం సుంకాల హెచ్చరికలు జారీ చేశారు. తాజా డీల్‌తో బీజింగ్‌కు ఊరట లభించినట్లయ్యింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.
ఇక జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్ గొప్ప నేత అని.. ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే జిన్‌పింగ్ కూడా అమెరికాకు వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇక జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఆయా లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగాయని వెల్లడించారు. ఉమ్మడి మార్గదర్శకత్వంలో అమెరికా-చైనా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని.. అప్పుడప్పుడు ఘర్షణలు పడటం సాధారణమే అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.