ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పన్నూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) ఉగ్ర సంస్థకు చీఫ్ గా ఉన్న పన్నూ.. ‘‘ఇది ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభం కాదు.. ఇది ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభం’’ అని బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. షహీన్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చకోబోతున్నాం అని ఆడియో రికార్డ్ సందేశంలో బెదిరించాడు.
Read Also: TRAI: జియో, ఎయిర్‌టెల్ కు కస్టమర్ల వెల్లువ.. చేజార్చుకున్న వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్
అనేక బెదిరింపు కాల్స్ రావడంతో కొంతమంది స్థానికులు అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉగ్రవాద చర్యలకు పాల్పడున్న ఇతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 2019లో మొదటి కేసు నమోదు చేసింది. దేశంలో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో భీభత్సం సృష్టించాలనే ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో పన్నూపై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అదే సంవత్సరంలో అతడిని కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల పలు సందర్బాల్లో ప్రధాని మోడీతో పాటు మంత్రులు జై శంకర్, అమిత్ షా, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ని బెదిరిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ అంశం తీవ్ర వివాదాన్ని రాజేసింది. అప్పటి నుంచి నిజ్జర్ మృతిపై పన్నూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల కెనడాలోని హిందువులను భారత దేశం వెళ్లాలని బెదిరించాడు. దీనిపై అక్కడి హిందూ సంఘాలు కెనడాలోకి పన్నూ రాకుండా అడ్డుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాయి.