Cabinet Announces Bonus For Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్‌ఎఫ్ సిబ్బందిని మినహాయించి నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించబడతాయి.
ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే ప్రయాణికులకు, గూడ్స్ సేవల పనితీరులో రైల్వే ఉద్యోగులు ముఖ్యమైన పాత్ర పోషించారు. వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో కూడా రైల్వే ఉద్యోగులు ఆహారం, ఎరువులు, బొగ్గు ఇతర వస్తువుల వంటి నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేలా చూసుకున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
Read Also: Maheshwar Reddy: కేటీఆర్‌కు ఆ అర్హత లేదు.. అది సోనియాగాంధీ పెట్టిన భిక్ష
2021-22 ఆర్థిక ఏడాదిలో రైల్వేలు 184 మిలియన్ టన్నుల సరకు రవాణాను సాధించింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికం. రైల్వే ఉద్యోగులకు 78 రోజు పీఎల్బీ చెల్లింపు కోసం రూ.1,832.09 కోట్లుగా అంచనా వేశారు. నెలకు రూ. 7,000 చొప్పున అర్హతను బట్టి రూ.17,951లను 78 రోజులకు గానూ చెల్లించనుంది రైల్వే శాఖ.
మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం, 2002ను సవరించాలని కోరుతూ..రాష్ట్ర సహకార సంఘాల(సవరణ) బిల్లు 2022కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెరుగుతున్నా.. సామాన్యుడిపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వరంగ సంస్థల చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్లను వన్ టైమ్ గ్రాంట్ గా ఇస్తున్నట్లు వెల్లడించారు.