Amit Shah: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రతిపక్షాలు అబద్ధాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కి వచ్చిదిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సీఏఏ లక్ష్యమని చెప్పారు.
ముస్లింలకు భారతదేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని హక్కు ఉందని అయితే, ఈ చట్టం మాత్రం ఆయా దేశాల్లో పీడించబడుతున్న మైనారిటీల కోసమని చెప్పారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైతే ప్రభుత్వం దీనిపై పునరాలోచించవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానంగా, సీఏఏని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సీఏఏని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్న దానిపై వ్యాఖ్యానిస్తూ.. ఎలాగూ ఇండియా కూటమి అధికారంలోకి రాదని తెలుసని ఎద్దేవా చేశారు.
Read Also: Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
సీఏఏపై బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలను సృష్టిస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు వేరే పనిలేదని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా మా రాజకీయ ప్రయోజనాల కోసమే అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ఆర్టికల్ 370 తొలగిస్తామని 1950 నుంచి చెబుతున్నామని అమిత్ షా చెప్పారు. సీఏఏ నోటిఫికేషన్ వెలువడే సమయంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించగా, అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలన్నీ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయని షా అన్నారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేయాలని, తమ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలని అనుకుంటున్నాయని అమిత్ షా మండిపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్ విమర్శల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి బయటపడిన తర్వాత నుంచి ప్రశాంతత కోల్పోతున్నారని అన్నారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దొంగతనాలు, అత్యాచారాలు పెరుగుతాయని కేజ్రీవాల్ ప్రకటనపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడరని, వారిని ఎందుకు వ్యతిరేకించరని అమిత్ షా ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందని, చొరబాట్లను ఆపుతామని అన్నారు. మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ చొరబాట్లను అనుమతిస్తే దేశ భద్రత సమస్య ఎదుర్కొంటుందని, ఆమెకు శరణార్థులకు, చొరబాటుదారులకు తేడా తెలియదని అన్నారు.