BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర యడియూరప్పను బీజేపీ అధిష్టానం కర్ణాటక కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర అధ్యక్ష నియామకం తక్షణమే అమలులోకి వచ్చేలా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నియామక పత్రంలో పేర్కొన్నారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తు్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్ష పదవిని సీటీ రవి, సునీల్ కుమార్, బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆశించారు. వీరితో పోలిస్తే రేసులో విజయేంద్ర ముందున్నారు.
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్ని్కల్లో శిఖారిపుర అసెంబ్లీ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11,008 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. 2020లో విజయేంద్ర బీజేపీ కర్ణాటక విభాగానికి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.. ప్రస్తుతం అధ్యక్షుడిని చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.