బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పలు చోట్ల ముస్లింలు తమ నిరసనను తెలియజేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేశారు. ముఖ్యంగా ఇటీవల యూపీ కాన్పూర్ లో రాళ్లదాడి చేయగా.. నిన్న ప్రయాగ్ రాజ్ లో కొంతమంది అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో పాటు సహరాల్ పూర్ లో కూడా ఉద్రిక్తత నెలకొంది. ఇక బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో ఆందోళను హింసాత్మకంగా మారాయి. రాంచీ అల్లర్లలో ఇద్దరు మరణించారు.
ఇదిలా ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన నిందితులను గుర్తించే పనిలో ఉంది ఉత్తర్ ప్రదేశ్ యోగీ సర్కార్. మరోసారి యోగీ తన బుల్డోజర్ అస్త్రాన్ని బయటకు తీశారు. సహరాన్ పూర్ లో అల్లర్లకు కారణం అయిన ఇద్దరు నిందితులను గుర్తించి వారి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన 64 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ముజమ్మిల్, అబ్దుల్ వకీర్ నివాసాలను మునిసిపల్ సిబ్బంది కూల్చివేసింది. ప్రతీ శుక్రవారం తరువాత శనివారం ఉంటుందని యూపీ సీఎం మీడియా అడ్వైజర్ మృత్యుంజయ్ కుమార్ ట్విట్టర్ లో ఆందోళనకారులను హెచ్చరించారు.
జూన్ 3న కాన్పూర్ లో అల్లర్లలో ప్రమేయం ఉన్న జాఫర్ హయత్ హష్మీ ఆస్తులను కూడా కూల్చివేశారు. ఇతని దగ్గరి బందువైన ఇస్తియాఖ్ కొత్తగా నిర్మించుకున్న భవనాన్ని కాన్పూర్ డెవలప్మెంట్ అథారిటీ కూల్చిేసింది. కాన్పూర్ అల్లర్లోప్రమేయం ఉన్న జావేద్ అహ్మద్ ఖాన్, మహ్మద్ రహీల్, సుఫియాన్, హష్మీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని మూడు రోజుల విచారణ కోసం పోలీసులకు అప్పగించింది స్థానిక కోర్ట్. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్, షహరాన్ పూర్, ప్రయాగ్ రాజ్ మొదలైన చోట్ల అల్లర్లకు కారణం అయిన మొత్తం 230 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.