దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. అర్హతకలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో 80 శాతం మంది వరకు మొదటి డోసు తీసుకున్నారు. 60 శాతానికిపైగా ప్రజలు రెండో డోసు తీసుకున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12 వ డోసు తీసుకునేందుకు సంబందిత వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లగా వ్యాక్సిన్ సెంటర్ మూసి ఉండటంతో వెనుదిరిగాడు.
Read: ఒంటికాలితో శబరిమలకు పాదయాత్ర… 105 రోజుల్లో 750 కి.మీ. ప్రయాణం
బీహార్‌లోని మాధేపుర జిల్లాలోని ఉదకిషన్‌గంజ్ డివిజన్‌లోని ఒరాయ్ గ్రామానికి చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ ఫిబ్రవరి 13 వ తేదీని మొదటి డోస్ తీసుకున్నాడట. ఆ తరువాత వరసగా 11 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. 11 డోసులు తీసుకున్నా తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పాడు. 11 డోసులు ఎప్పుడెప్పుడు తీసుకున్నాడో రాసిపెట్టుకున్నాడు. ఒకటి, రెండు డోసులు తీసుకోవడానికే ప్రజలు భయపడుతున్న సమయంలో బ్రహ్మదేవ్ ఏకంగా 11 డోసులు టీకా తీసుకోవడం సంచలనం కలిగింది. దీనిపై బీహార్ ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది.