ఐదారేళ్లలో భారతీయ జనతా పార్టీ కనుమరుగు అవుతుందంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే కరీముద్దిన్ బర్భూయా సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీహార్ నుంచే బీజేపీ పతనం ఆరంభమైందని.. బీజేపీని మరోసారి ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.. మరోవైపు.. సెప్టెంబరు 2న పలువురు కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరతారని ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయా ప్రకటించారు. బార్‌పేట జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 2న తన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు..
Read Also: Harish Rao: ఇది జూటేబాజ్ బీజేపీ పార్టీ.. పెద్దలకు పెట్టి, పేదల్ని ముంచుతోంది
ఇక, ఏప్రిల్ 21న ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, కాంగ్రెస్‌ను మునిగిపోతున్న ఓడగా అభివర్ణించారు.. ఇప్పుడు తమ పార్టీ అస్సాం నుండి బీజేపీని సాగనంపేందుకు నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఇక, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి రిపున్ బోరా వైదొలగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోతున్నదని అన్నారు.. ఇది ఏఐయూడీఎఫ్ పుంజుకోవడానికి సరైన సమయంగా చెప్పుకొచ్చారు.. మరోవైపు, రుక్మిణీనగర్ బిహు క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అస్సాం కాంగ్రెస్ నేతలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బార్‌పేట మాజీ ఎమ్మెల్యే, బార్‌పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుర్ రహీం ఖాన్ మే నెలలో పార్టీకి రాజీనామా చేశారు. తగిన గౌరవం లేదని వాపోయిన ఆయన… నేను బార్‌పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరియు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు పేర్కొన్న విషయం తెలిసిందే.. కాగా, బీహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమి నుంచి సీఎం నితీష్ కుమార్ వైదొలగడం.. ఆ వెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.