కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్‌కు రాహుల్‌ను ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖాట్మాండులోని నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను వైరల్‌గా మార్చింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. దేశంలో సంక్షోభం నెలకొంటే.. సాహెబ్ విదేశాల్లో తిరుగుతున్నారంటూ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. దీనికి బీజేపీ నేత జితేందర్ పాల్ బగ్గా కౌంటరిచ్చారు. ఖాట్మండులోని నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ కనిపించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
రాహుల్‌గాంధీని ముఖ్యంగా రెండు విషయాల్లో కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. నేపాల్‌లో రాహుల్ పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికీ.. ఖాట్మండు నైట్‌క్లబ్‌లో చైనా దౌత్యవేత్త యౌ యాంకీతో ఆయన కలిసి ఉండటాన్ని హైలైట్ చేస్తోంది. ఎందుకంటే, చైనా దౌత్యవేత్త యౌ యాంకీపై అనేక ఆరోపణలున్నాయి. గతంలో నేపాల్ మాజీ ప్రధానితో పాటు ఆ దేశంలోని పలువురు రాజకీయ నాయకులను హనీట్రాప్ చేసినట్లుగా కూడా ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ విషయాలను బీజేపీ నేతలు ట్రోల్ చేస్తూ.. రాహుల్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రెండోది.. కాంగ్రెస్ అధికారం కొనసాగిస్తోన్న రాజస్థాన్‌లో ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్నాయి. జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో రాహుల్‌గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని, రాహుల్ గాంధీ నైట్‌పార్టీ పొలిటీషియన్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తన పార్టీకి, దేశ ప్రజలకు అవసరమైనప్పుడు నేపాల్‌లో రాహుల్ గాంధీ నైట్ పార్టీ చేసుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా విమర్శించారు.
మరోవైపు, రాహుల్ నైట్‌క్లబ్ వీడియోపై కాంగ్రెస్ స్పందించింది. మిత్ర దేశంగా ఉన్న నేపాల్‌లో స్నేహితురాలి పెళ్లికి రాహుల్ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా. వివాహానికి హాజరుకావడం చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు. స్నేహం చేయడం నేరమని బీజేపీ నిర్ణయించిందేమో’ అని ట్వీట్ చేశారు. 2015లో ప్రధాని మోదీ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి అనూహ్యంగా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సుర్జేవాలా విమర్శించారు. ఇక రాహుల్ నైట్ పార్టీ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేయగా…. కాంగ్రెస్ నేతలు కౌంటర్‌కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవ్‌డేకర్ ఫొటోను ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్. ప్రకాశ్ జవ్‌డేకర్ ఓ పార్టీలో షాంపైన్ బాటిల్ పట్టుకున్న ఫొటోలను ట్వీట్ చేశారు. మొత్తంమీద, ఖాట్మండు నైట్ క్లబ్‌లో రాహుల్‌గాంధీ వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతోపాటు ట్వీట్ వార్ కొనసాగుతోంది.