Baba Siddique Murder: ప్రముఖ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమైంది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాయలం సమీపంలో గత రాత్రి కాల్చి చంపారు. ఈ హత్యని రాజకీయం చేయవద్దని బీజేపీ నేతృత్వంలోని మహా ప్రభుత్వం అభ్యర్థించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో ‘‘లా అండ్ ఆర్డర్’’ పతనమైందని నిందించింది. 66 ఏళ్ల సిద్ధిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత రాత్రి ముగ్గురు నిందితులు ముసుగులు ధరించి, సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిక్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు.
ఈ హత్య తర్వాత ముంబై పోలీసులు ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్లను అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. నలుడు సల్మాన్ ఖాన్‌ని సిద్ధిక్ అత్యంత సన్నిహితుడు. ఇటీవల కాలంలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించింది. సల్మాన్ ఖాన్‌కి సన్నిహితుడు కావడంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిక్‌ని టార్గెట్ చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Rajendra Nagar: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..
ఇదిలా ఉంటే, ఈ హత్యపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘బాబా సిద్ధిఖ్ జీ యొక్క విషాద మరణం దిగ్భ్రాంతికరమైనది , బాధాకరమైనది. ఈ భయానక సంఘటన మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమైందని బహిర్గతం చేసింది. ప్రభుత్వం బాధ్యత వహించాలి మరియు న్యాయం గెలవాలి.’’ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా సిద్ధిక్ మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరస్తుల్ని త్వరగా శిక్షించాలని కోరారు. మహరాష్ట్రలో ఎన్డీయే హాయంలో ఏం జరుగుతోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ మాట్లాడుతూ.. మహాయుతి(బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)) ప్రభుత్వం దోషుల్ని అణిచివేసేందుకు సమయం వృధా చేయదు అని అన్నారు. “ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే ఇద్దరు నిందితులను పట్టుకున్నాయి. మూడవ నిందితుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది మరియు అతను కూడా త్వరలో పట్టుకుంటాడు” అని భండారీ చెప్పారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ హత్యను రాజకీయం చేయవద్దని కోరారు. ఈ కేసు దర్యాప్తు కోసం 5 బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు షూటర్లలో ఇద్దరు హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ధరమ్‌రాజ్ కశ్యప్ (19)ని పట్టుకున్నారు.